‘వాక్కు నా దైవం శబ్దం నా దైవం’.ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆచార్య సి.నారాయణ రెడ్డిని ‘మీరు ఆస్తికులా?’ అని అడిగిన ప్రశ్నకు వారు ఇచ్చిన సమాధానం ఇది! నిజమే! సి.నారాయణ రెడ్డి వాక్కును,శబ్దాన్ని ఎంతగానో ఆరాధించారు కాబట్టి వారి కవితా రచనల్లో, మాటల్లో
వాక్కూ, శబ్దం నవరసమయంగా భాసిస్తూ సాక్షాత్కరించింది. సాహిత్య రంగంలో వారికి పద్మశ్రీ, పద్మభూషణ్, జ్ఞానపీఠ్ వంటి పురస్కారాలను ఎన్నింటినో వరించేలా చేసింది
ఆ వాక్, శబ్ద సరస్వతి!
నాటి ఉమ్మడి కరీంనగర్ (నేటి రాజన్న సిరిసిల్ల) జిల్లాలోని వేములవాడకు సమీపంలో హనుమాజీపేటలో 1931 జూలై 29 నాడు ఏ సాహిత్య గంధ మూ లేని రైతు కుటుంబం లో బుచ్చమ్మ, మల్లారెడ్డి దంపతులకు సి.నారాయణ రెడ్డి ఏకైక పుత్రుడిగా జన్మించారు. వేములవాడలో హరికథలు వింటూ, పల్లెలోని జానపదులతో సన్నిహితంగా ఉంటూ, పల్లెవాగు తరగలలోని లయను అవగాహన చేసుకుంటూ, చందో నియమాలు తెలియకున్నా చిన్ననాటి నుంచి నారాయణరెడ్డి పద్యాలు, గేయాలు అల్లడం మొదలుపెట్టారు.
విద్యార్థిగా ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నారు. ఆ విధంగానే వారి విద్యాప్రస్థానం సిరిసిల్ల నుంచి కరీంనగర్, హైదరాబాద్ దాకా సాగింది. బీఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదువుకున్న సినారె తెలుగు భాషా సాహిత్యాలను ఎక్కువగా, మక్కువగా అధ్యయనం చేశారు. ఆ రోజుల్లో ‘సింహాద్రి’ అనే కలం పేరుతో రచనలు చేశారు. దాశరథి, వట్టికోట ఆళ్వారుస్వామి, బిరుదురాజు రామరాజులతో కలిసి తెలంగాణ రచయితల సంఘం స్థాపనలో పాలుపంచుకున్నారు. బిరుదురాజు రామరాజుతో కలిసి జంటగా ‘రామ నారాయణ’ పేరిట కవిత్వాన్ని చెప్పారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తిచేసి సికింద్రాబాద్ కళాశాలలో లెక్చరర్‌గా చేరి తన అధ్యాపక జీవనాన్ని ప్రారంభించారు. ‘ఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయము ప్రయోగాలు’ అంశంపై పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా పొందారు. అది ఇప్పటికీ విద్యార్థులకు పరిశోధకులకు విశిష్ట ఆచూకీ గ్రంథంగా ఉపయోగపడుతున్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలోనే పనిచేస్తూ లెక్చరర్ నుంచి రీడర్‌గా, ప్రొఫెసర్‌గా పదోన్నతులు పొందారు. ఆ తర్వాత అధికార భాషా సంఘం అధ్యక్షులుగానూ, ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గానూ, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గానూ తన విశిష్ట సేవలను అందించారు. భాషా సాంస్కృతిక సలహాదారులుగా పనిచేశారు. రాజ్యసభ మెంబర్‌గా నియమితులై ఆ పదవికే వన్నె తెచ్చారు.
ఆచార్య నారాయణ రెడ్డి కవిగా, సినీ కవిగా, ఆచార్యుడిగా, వక్తగా, తెలుగు గజల్ వాగ్గేయకారుడిగా, పరిపాలనాధికారిగా తన ప్రత్యేకతను, దక్షతను ప్రదర్శించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
డాక్టర్ సి.నారాయణరెడ్డి తన 60 ఏండ్ల సాహితీ ప్రస్థానంలో మొత్తం 80 పైచిలుకు రచనలను ప్రచురించి ప్రకటించారు. వీరి తొలిగ్రంథం ‘నవ్వని పువ్వు’. ఇది గేయనాటికల సంపుటి. 1953లో వచ్చింది. అక్కడి నుంచి ‘జలపాతం’ (ఇందులో త్రివేణి సంగమం లాగా పద్య, గేయ, వచన కవితలు ఉన్నాయి). ‘అజంతా సుందరి’, ‘వెన్నెలవాడ’, ‘రామప్ప’ వంటి గేయనాటిక సంపుటులు ‘రుతుచక్రం’ (ఋతువులపై కావ్యం), ‘నాగార్జున సాగరం’, ‘విశ్వనాథ నాయకుడు’, ‘కర్పూర వసంతరాయలు’ వంటి గేయ కథా కావ్యాలూ, ‘మంటలూ మానవుడు’, ‘మనిషి చిలక’, ‘ముఖాముఖి’, ‘మధ్యతరగతి మందహాసం’, ఉదయం నా హృదయం’, ‘మార్పు నా తీర్పు’, ‘తేజస్సు నా తపస్సు’ వంటి వచన కవితా సంపుటులు, ‘విశ్వగీతి’, ‘మృత్యువు నుంచి’, ‘భూమిక’, ‘మథనం’, ‘విశ్వంభర’ (ఇది సినారెకు జ్ఞానపీఠ అవార్డును తెచ్చిపెట్టింది), ‘మట్టి మనిషి’, ‘ఆకాశం’ వంటి వచన కవితా దీర్ఘకావ్యాలూ, ‘మీరాబాయి’, ‘ముత్యాల కోకిల’ వంటి అనువాద రచనలూ, యాత్ర రచనలూ, విమర్శనా వ్యాస సంకలనాలు ఆయన రచనా సంపదలో ఉన్నాయి.
తెలుగు భాషతో పాటు ఉర్దూభాషలో సైతం మంచి ప్రావీణ్యం ఉన్న సినారె ఉర్దూలో కూడా కవిత్వం రాశారంటారు. ఉర్దూ సాహిత్య సంప్రదాయంలోని గజల్ ప్రక్రియను కవి డాక్టర్ దాశరథి పరిచయం చేయగా సినారె ‘పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని’ అంటూ గజళ్లు విస్తృతంగా రాసి, తానే గానం చేసి తెలుగు గజల్ వాగ్గేయకారుడయ్యారు.
‘నా అనుభూతిలో బ్రతుకునంత ఇమిడ్చిన కావ్యగీతిలో/ మాయగ లేని మంజు మధుమాస విలాస సుహాస రేఖికా/ ఛాయలు నిలిచిపోయినను చాలు జవాబుల గ్రీష్మమందు నా/ గేయము లాలపించి ఉలికించెద చల్లని తేనె వానలన్’ (జలపాతం సంపుటి) అంటూ మధుర మంజుల మంజులంగా పద్యాలు రాయగలిగి ఉండి కూడా ‘ఈ వసంతాలలో నీ చూపు పిలిచెనా/ ఈ వసంతాలలో నీ రూపు మొలిచెనా’ (తేనెపాటలు) అంటూ ఇష్టంగా తేనెపాటలు రాసినా.. ‘సాగుమా ఓ నీల మేఘమా! గగనవీణ మృదుల రాగమా!’ అంటూ ఎంతో ఇష్టంగా గేయాలు రేడియో కోసం రాసిన సినారె, తర్వాత మారిన కాలాన్ని అనుసరించి వచన కవితలు రాశారు. ఇటు వచన కవితలు రాస్తూ, అటు సినిమా కోసం మాత్రాఛందస్సులో పాటలు రాస్తూ సవ్యసాచిగా పేరు గడించారు.
వక్తగా సినారె: అత్యద్భుతంగా తీయని గొంతుతో పబ్లిక్ మీటింగుల్లో ప్రసంగించే సినారె దాదాపు ప్రతిరోజూ చిక్కడపల్లి సిటీ సెంటర్ లైబ్రరీలోను, త్యాగరాజ గానసభ మీటింగ్ హాల్లోనూ జరిగే సాహిత్య సభలకు అధ్యక్షుడిగాను, ముఖ్య అతిథిగానూ హాజరై సముచిత ఉపన్యాసం చేసి ప్రేక్షక శ్రోతలను ఆకట్టుకునేవారు.
భారతీయ తెలుగు సాహిత్యకారుడిగా సినారె విదేశాల్లో పర్యటించి ప్రసంగించారు. విలువగల సినారె కవిత్వం ఇంగ్లీషులోకి మన దేశ భాషల్లోకి అనువాదమైంది.
ఉదయం తన హృదయంగా, ఇంటిపేరు చైతన్యంగా, తేజస్సు తన తపస్సుగా ప్రకటించిన సినారె ‘ఈ తపస్సు కొనసాగనీ/ ఘనస్వామ్యం విరిగే దాకా/ పణవిపణి లాంటి లోకంలో ప్రగతి మూల్యం ఎదిగేదాకా’ ‘తేజస్సు నా తపస్సు’ అంటాడు. ‘పదునెక్కిన పది గోళ్ల మధ్య/ బిగిసిన రెండు పిడికిళ్ల మధ్య/ నెత్తురు కక్కిన పెత్తనం/ అరచి అరచి చచ్చిన దొరతనం’ (తేజస్సు నా తపస్సు – భరత వాక్యం కవిత) అంటూ దొరతనంపై తిరుగుబాటును నాలుగు పంక్తుల్లో చెప్తాడు.
‘గతమనెడు వజ్రంపు గోడల కట్టడంపై నిట్ట నిలువున/ శిరసు నెత్తిన స్వర్గమయ గో/పురము సుమీ వర్తమానం’ (సమదర్శనం) అంటూ చెప్పిన సినారె-‘రాజనీతిలో నీతి విరిగితే రక్షణ ఏదీ సమాజానికి/ నడిపే రక్తం కుళ్లిపోతే మనుగడ ఉంటుందా శరీరానికి’ (కలం సాక్షిగా) అని వాపోతాడు. సప్తవర్ణాలను ఏక కిరణంగా చేసి ప్రకాశించే సహస్ర కిరణుడు సూర్యునితో కవిని పోల్చడం సరైనదేనంటూ.. ‘పరిమళాల నెవడాపును? పైరగాలి నెవడాపును? ఎవడాపును మానవతా రవిరుక్కును? కవివాక్కును?’ అని ప్రశ్నిస్తూ.. ఎవడూ ఆపలేడని ధ్వనిగర్భితంగా సమాధానం చెప్తాడు. ‘కలిమికి సాఫల్యం నలుగురికీ దక్కినప్పుడే/ పదవికి సాఫల్యం అది ప్రజల మనసుకి ఎక్కినప్పుడే’ (ప్రపంచపదులు) అని తన కవిత్వం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా మానవతావాదాన్ని ప్రబోధించిన కవి ఆచార్య డాక్టర్ సి.నారాయణ రెడ్డి.
(ఆచార్య సినారె93వ జయంతి సందర్భంగా…)